‘థగ్‌లైఫ్‌’కి కష్టాలు.. భారీ జరిమానా విధింపు?

'థగ్‌లైఫ్‌'కి కష్టాలు.. భారీ జరిమానా విధింపు?

నటీనటులు కమలహాసన్, శింబు, త్రిష, నాజర్‌లతో పాటు ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన మణిరత్నం చిత్రం ‘థగ్‌లైఫ్‌’కి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. విడుదలైనప్పటి నుంచీ ఈ సినిమా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇప్పుడు దీనికి మరో షాక్ తగిలింది. ఈ సినిమాకు రూ. 25 లక్షల జరిమానా విధించినట్లు ప్రచారం జరుగుతోంది.

కర్ణాటకలో కష్టాలు..
నిజానికి, ‘థగ్‌లైఫ్‌’పై విడుదల ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, కర్ణాటకలో సినిమా ప్రమోషన్స్ సందర్భంగా కమలహాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సినిమాకు అడ్డంకులు సృష్టించాయి. “తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టింది” అని కమలహాసన్ వ్యాఖ్యానించడంతో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కర్ణాటకలో సినిమా విడుదలను అడ్డుకున్నారు.

కర్ణాటక హైకోర్టు కూడా కమలహాసన్ వ్యాఖ్యలను తప్పుబట్టి, క్షమాపణ చెప్పాలని సూచించింది. అయితే, సినిమా విడుదలను అడ్డుకోరాదని, పోలీసులు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వం సినిమాకు భద్రత కల్పిస్తామని తెలిపింది. అయినప్పటికీ, ‘థగ్‌లైఫ్‌’ ఇప్పటికీ కర్ణాటకలో విడుదల కాలేదు. విడుదలైన చోట్ల కూడా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు తమ పెట్టుబడులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఓటీటీలో ధర తగ్గింపు, మల్టీప్లెక్స్‌ల జరిమానా
ఇదిలా ఉంటే, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయినందుకు దర్శకుడు మణిరత్నం క్షమాపణ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘థగ్‌లైఫ్‌’ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ రూ. 130 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే సినిమా పరాజయం పాలవడంతో, నెట్‌ఫ్లిక్స్ కేవలం రూ. 90 కోట్లే చెల్లిస్తామని వెనకడుగు వేసినట్లు తెలిసింది. చివరికి చర్చల అనంతరం రూ. 110 కోట్లు ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం.

వీటితో పాటు, మల్టీప్లెక్స్ థియేటర్లు సినిమాకు రూ. 25 లక్షల జరిమానా విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ‘థగ్‌లైఫ్‌’ సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో ప్రసారం చేస్తామని కమలహాసన్ చెప్పినప్పటికీ, ఆ ఒప్పందాన్ని ఇప్పుడు రద్దు చేసుకోవడంతో ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఇలా ‘థగ్‌లైఫ్‌’ సినిమాకు వరుసగా అడ్డంకులు ఎదురవుతుండటం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment