సినిమా ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటు ఉండే వినోదం. కానీ, ఇప్పుడు థియేటర్లలో సినిమా చూడాలంటే ఎంత ఖర్చు పెట్టాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక కుటుంబం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే, అదీ మొదటి రోజు ఆట చూడాలంటే ఎంత ఖర్చు అవుతుంది..? ఒకప్పుడు 300–400 రూపాయలతో కుటుంబం సినిమా వెళ్లగలిగేది. నేడు టికెట్ల ధరలకే వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. స్నాక్స్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఇది చాలదన్నట్లుగా పెద్ద హీరోలు, అగ్ర కథనాయకులు అని వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ పరిస్థితులు ఇప్పుడు ప్రేక్షకుల సహనాన్ని దాటేయడంతో, రాష్ట్రవ్యాప్తంగా తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది.
జగన్ మాటలతో ఏకీభవిస్తున్న ప్రేక్షకుడు..
గత వైసీపీ ప్రభుత్వ కాలంలో, సినిమా టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని, చిన్న సినిమాలూ, పెద్ద సినిమాలూ అని తేడా లేకుండా అన్ని సినిమాలూ బతికేలా ప్రత్యేక వ్యవస్థ అవసరమని వైఎస్ జగన్ ప్రతిపాదన తెచ్చారు. జగన్ మాటలను కొంతమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రత్యర్థులు ఈ నిర్ణయాలను ఇండస్ట్రీకి వ్యతిరేకం అని ప్రచారం చేశారు. జగన్ సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నాడని వాదన తెచ్చారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూసి సాధారణ ప్రేక్షకుడు మాత్రం జగన్ మాటలతో ఏకీభవిస్తున్నాడు.
“టికెట్ ధర సామాన్యుడి చేరువలో ఉండాలి” అనే వైఎస్ జగన్ ఆలోచన ఇప్పుడు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లలో అలివిమాలిన ధరలపై ప్రేక్షక ప్రపంచ నిరసన స్వరం వినిపించింది. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న సినీ ప్రేక్షకులు, థియేటర్లలో ధరలకు వ్యతిరేకంగా ప్రశ్నించడం ప్రారంభించారు. ఐ బొమ్మ రవి అరెస్ట్‌తో టికెట్ ధరల అంశం కీలకంగా మారింది. అధిక రేట్లకు వ్యతిరేకంగా ఆందోళన చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలో సినిమా థియేటర్లలో దోపిడీ పెరిగిపోయిందని, నియంత్రించాలని ప్రొగ్రెసివ్ యూత్ లీగ్ డిమాండ్ చేసింది. థియేటర్లలో ఎక్కువ ధరలకు సినిమా టికెట్లు అమ్మడం, స్నాక్స్ ధరలు వందల్లో ఉండడం, ఇతర సమస్యలపై శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్లో ప్రేక్షకుల నుంచి సంతకాలను సేకరించారు.
వినోదం ప్రతి ఒక్కరి హక్కు. అది భారంగా మారకూడదు. థియేటర్లు కూడా వ్యాపారం చేసుకోవాలి, కానీ ప్రేక్షకుడి పరిస్థితి దృష్టిలో పెట్టుకోవాలి. అలా లేనప్పుడు ప్రేక్షకుడు కూడా ప్రశ్నించగలడని, దోపిడీకి వ్యతిరేకంగా నిలబడగలడని ఈ ఘటనలు చూపిస్తున్నాయి. ఈ తిరుగుబాటు వల్ల ప్రభుత్వం, థియేటర్ల యాజమాన్యం, ఇండస్ట్రీ మేనేజ్‌మెంట్ అందరూ ధరల విధానాన్ని పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా హాల్స్‌లో అధిక ధరల దోపిడీని అరికట్టాలన్న డిమాండ్ బలం పుంజుకుంటున్నది.








