ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సినిమా అభిమానులకు కీలక అప్‌డేట్ వెలువడింది. ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం “ది రాజాసాబ్” (The Raja Saab) విడుదల నేపథ్యంలో టికెట్ ధరల (Ticket Prices) పెంపు (Hike), ప్రత్యేక షోలకు (Special Shows) ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2026 జనవరి 9న సినిమా విడుదల కానుండగా, దీనికి ముందు రోజు అయిన జనవరి 8న సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఒక ప్రత్యేక షో నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్పెషల్ షోకు గరిష్టంగా రూ.1000 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధర నిర్ణయించగా, రోజుకు ఐదు షోలకే పరిమితి విధించింది. ఈ నిర్ణయం సినిమా విడుదలపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.
అదే సమయంలో, సినిమా విడుదలైన రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు కూడా అనుమతి లభించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై అదనంగా రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 (జీఎస్టీతో కలిపి) పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఈ పెంపు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ రేట్లకు అదనంగా వర్తించనుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో రోజుకు ఐదు షోలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, లైసెన్సింగ్ అధికారులు, పోలీస్ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో “ది రాజాసాబ్” విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద సందడి ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.








