మూవీ : ది రాజాసాబ్
జానర్ : హారర్ కామెడీ థ్రిల్లర్
యాక్టర్స్: ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్, బొమన్ ఇరానీ, సంజయ్ దత్ తదితరులు
ప్రొడ్యూసర్: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
స్టోరీ, డైరెక్షన్: మారుతి
మ్యూజిక్: తమన్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేది: జనవరి 9
⭐ రేటింగ్: 2.5 / 5
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’ (The Raja Saab) పై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ చాలా కాలం తర్వాత పూర్తిగా వినోదాత్మకమైన, లైట్ హారర్ జోనర్‌లో కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ట్రైలర్‌తోనే అంచనాలను పెంచిన ఈ మూవీ ఎలా ఉంది? (Rajasaab Review) ఎలాంటి థ్రిల్ పంచింది?. మరి ‘ది రాజాసాబ్’ ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం.

కథ ఏంటంటే..?
దేవనగర సంస్థానానికి జమీందారు అయిన గంగాదేవి (జరీనా వహాబ్) తన మనవడు రాజు అలియాస్ రాజాసాబ్ (ప్రభాస్)తో కలిసి సాదాసీదా జీవితం గడుపుతుంది. మతిమరుపుతో బాధపడుతున్న గంగాదేవి చాలా విషయాలు మర్చిపోతున్నా, తన భర్త కనకరాజు (సంజయ్ దత్)ను మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. కలల్లో తరచూ కనిపించే భర్తను తన వద్దకు తీసుకురావాలని మనవడిని కోరుతుంది.
అయితే కనకరాజు సామాన్యుడు కాదు. అతడికి మర్మ శక్తులు, మంత్రవిద్యలు తెలుసు. తన భార్య, మనవడిని మాయోపాయాలతో నర్సాపూర్ అడవిలోని ఓ పాత రాజమహల్‌కు రప్పిస్తాడు. ఆ కోటలోకి అడుగుపెట్టిన తర్వాత వారిద్దరినీ చంపాలనే భయంకరమైన పథకం వేస్తాడు.
తాతలో దాగున్న ఆ భయానక శక్తులను రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? కనకరాజు అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఈ ప్రయాణంలో రాజాసాబ్ జీవితంలోకి వచ్చిన భైరవి (మాళవిక మోహనన్), బ్లెస్సీ (నిధి అగర్వాల్), అనిత (రిద్ధి కుమార్)ల పాత్రలు ఏమిటి? అన్నదే కథ.

సినిమా ఎలా ఉందంటే..?
భారీ యాక్షన్ సినిమాల తర్వాత ప్రభాస్ ఈసారి హారర్ ఫాంటసీ కామెడీ జోనర్‌ను ఎంచుకోవడం కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్ ఫ్యాన్స్‌ను కొంతవరకు అలరిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా, కామెడీ సన్నివేశాలతో సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్‌లో కథ నెమ్మదించడంతో ఆసక్తి తగ్గుతుంది.
హారర్ జోనర్ అయినప్పటికీ సినిమాలో టెన్షన్ ఫీల్ పెద్దగా లేదు. కొన్ని సీన్లు మాత్రమే కాస్త ఉత్కంఠ కలిగిస్తాయి. ట్రైలర్‌లో చూపించిన కొన్ని కీలక సన్నివేశాలు సినిమాలో కనిపించకపోవడం నిరాశ కలిగిస్తుంది. చివర్లో ‘రాజాసాబ్ సర్కస్’ అంటూ సీక్వెల్‌కు హింట్ ఇవ్వడం విశేషం.

ప్రభాస్ నటన, లుక్
చాలా కాలం తర్వాత ప్రభాస్ పూర్తిగా వినోదాత్మక పాత్రలో కనిపించడం ఫ్యాన్స్‌కు ప్లస్. ఆయన కామెడీ టైమింగ్, డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి. ప్రచారంలో చూపించిన వింటేజ్ లుక్ తెరపై కూడా బాగానే వర్క్ అయ్యింది. యాక్షన్ సీన్లలో తనదైన స్టైల్‌లో మెప్పించారు.
హీరోయిన్లలో మాళవిక మోహనన్‌కు ఎక్కువ స్క్రీన్ టైమ్ దక్కింది. ఆమె అందం, నటన బాగున్నాయి. నిధి అగర్వాల్ పాటలకే పరిమితమైంది. రిద్ధి కుమార్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. సంజయ్ దత్, జరీనా వహాబ్ పాత్రలు సినిమాకు కీలకంగా నిలిచాయి.

ప్రభాస్ స్టార్‌డమ్‌ను మారుతి వాడుకున్నాడా?
ఇక్కడే సినిమా బలహీనత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌కు ఉండాల్సిన మాస్ ఎలివేషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో తక్కువగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగినా, సెకండాఫ్‌లో ప్రభాస్ పాత్రకు కావాల్సిన ఇంపాక్ట్ రావడం లేదు. అందుకే మారుతి ప్రభాస్ స్టార్‌డమ్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడన్న భావన కలుగుతుంది.
సాంకేతిక అంశాలు
థమన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ సీన్లను ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ, VFX పర్వాలేదనిపిస్తాయి. ముఖ్యంగా రాజమహల్ సెట్టింగ్స్ రిచ్‌గా ఉన్నాయి. అయితే ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి.
చివరగా..
మొత్తంగా చూస్తే ‘ది రాజాసాబ్’ ప్రభాస్ అభిమానులకు ఓ పరిమిత వినోదం. ప్రభాస్‌ను కొత్త లుక్‌లో, కామెడీ జోనర్‌లో చూడాలనుకునే వారికి నచ్చుతుంది. కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది యావరేజ్ మూవీగానే అనిపిస్తుంది. భారీ అంచనాలతో వెళ్లిన వారికి కొంత నిరాశ తప్పదు.








