ఫ్యాషన్ ప్రపంచం మళ్లీ కళకళలాడేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది డెవిల్ వెయర్స్ ప్రాడా 2’ తొలి టీజర్‌ను 20వ సెంచరీ స్టూడియోస్ విడుదల చేసింది. ఈ సీక్వెల్‌లో ఆన్ హాథవే, మెరిల్ స్ట్రీప్, ఎమిలీ బ్లంట్, స్టాన్లీ టూచీ మరోసారి తమ ఐకానిక్ పాత్రల్లో దర్శనమిచ్చారు.
30 సెకన్ల పాటు సాగిన ఈ టీజర్‌లో పాత్రల మధ్య ఉన్న బలమైన సంభాషణలు, శక్తివంతమైన హావభావాలు, ఫ్యాషన్ ప్రపంచంలోని ఆధిపత్య పోరాటం మరోసారి తెరపైకి రానున్నట్లు స్పష్టం చేస్తోంది. ఫిబ్రవరి 1న విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
ఎమిలీ బ్లంట్ – ఆన్ హాథవే మధ్య మారిన పవర్ డైనమిక్స్
ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచిన సన్నివేశం ఎమిలీ బ్లంట్, ఆన్ హాథవే మధ్య జరిగే కీలక సమావేశం. ఎమిలీ చార్ల్టన్ పాత్రలో ఎమిలీ బ్లంట్ మళ్లీ తన ట్రేడ్‌మార్క్ టెన్షన్, పర్ఫెక్ట్ స్టైల్‌తో కనిపించింది. ఇక ఆండీ సాక్స్ పాత్రలో ఆన్ హాథవే పూర్తిగా మారిన ప్రొఫెషనల్ అవతారంలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఎమిలీ, ఆండీని ఉద్దేశించి “నువ్వు మరింత ఆత్మవిశ్వాసంతో మారిపోయావు.. కానీ, నీ అసలు కనుబొమ్మలను మాత్రం అలాగే ఉంచుకున్నావు” అంటూ చురకలంటిస్తుంది.
ఈ సీక్వెల్‌లో ఎమిలీ లగ్జరీ బ్రాండ్‌లో కీలక ఎగ్జిక్యూటివ్ స్థాయికి చేరగా, ఆండీ జర్నలిజంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నట్లు చూపించారు. ఇద్దరి మధ్య ‘ఫ్రెనమీ’ (స్నేహం + శత్రుత్వం) రిలేషన్‌షిప్ కథను ముందుకు తీసుకెళ్లనుంది.
మోడ్రన్ మీడియా సవాళ్లలో మెరిల్ స్ట్రీప్
ఈ ట్రైలర్‌లో అసలైన ఆకర్షణగా నిలిచింది మెరిల్ స్ట్రీప్ నటించిన మిరాండా ప్రీస్ట్లీ పాత్ర. మొదటి భాగంలో ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలిన మిరాండా, ఈ సీక్వెల్‌లో ప్రింట్ మీడియా పతనాన్ని ఎదుర్కొనే స్థితిలో కనిపించనుంది.
ఇప్పుడామె తన మ్యాగజైన్‌ను నిలబెట్టుకోవాలంటే, మాజీ అసిస్టెంట్ ఎమిలీ చార్ల్టన్‌తో ఒప్పందాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా అడ్వర్టైజింగ్ బడ్జెట్ కోసం మిరాండా చేసే పోరాటం ఈ కథకు ప్రధాన బలంగా నిలవనుంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో మీడియా ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబించేలా మిరాండా పాత్రను మలిచిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఒకప్పుడు ట్రెండ్స్‌ని నిర్ణయించిన ఆమె, ఇప్పుడు అదే ట్రెండ్స్‌కు అనుగుణంగా మారాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది.







