అక్కినేని నాగచైతన్య మరియు సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన “తండేల్” మూవీ, ఫిబ్రవరి 7న గ్రాండ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. అల్లు అరవింద్ మరియు బన్నివాస్ ప్రొడ్యూసింగ్ చేసిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించాలని అనుకున్న చిత్రబృందం, ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఆహ్వానించింది. కానీ, ఇది కాస్త అనూహ్యంగా మారింది. ఈ వేడుకకు పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హైదరాబాద్‌లోని వారి ఫామ్ హౌస్‌లో ఇండస్ట్రీ పెద్దలకు, కుటుంబీకులకు పార్టీ ఇవ్వబోతున్నారు. దీంతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకేరోజు రెండు ఈవెంట్లకు పోలీసులను సర్దుబాటు చేయడం కుదరకపోవడంతో తండేల్ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.
అయితే, చివరి క్షణంలో ఈ వేడుకను వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ వెల్లడించారు. ‘ది ఐకానిక్ తండేల్ జాతర’ను రేపటికి (ఫిబ్రవరి 2) మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. “ఈ పాలి యాట గురితప్పేదే లేదంటూ” సినిమా డైలాగ్‌ను జోడించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.