APSRTC బ‌స్సులో ‘తండేల్’ మూవీ పైరసీ.. – నిర్మాత ఆగ్రహం

APSRTC బ‌స్సులో 'తండేల్' మూవీ పైరసీ.. - నిర్మాత ఆగ్రహం

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి కాంబోలో తెర‌కెక్కిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌ ‘తండేల్’ (Thandel) మూవీ టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వంలో, ప్ర‌ముఖ‌ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించారు. ఈనెల 7న విడుద‌లైన ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో మంచి వ‌సూళ్లు సాధిస్తోంది.

సినిమా విడుదలై మూడు రోజుల్లోనే రూ.62.37 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ‘తండేల్’కి, తొలి రోజే పైరసీ షాక్ ఎదురైంది. కొందరు సినిమాను పైరసీ చేసి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. తాజాగా, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ప్రదర్శనకు వచ్చినట్లు వార్తలు రావడం చిత్ర యూనిట్‌కు పెద్ద ఆందోళనను కలిగించింది.

ఈ విషయంపై నిర్మాత బన్నీ వాసు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘ఓ మీడియా సంస్థ‌లో వ‌చ్చిన న్యూస్‌ ద్వారా APSRTCకి చెందిన‌ బ‌స్సులో ‘తండేల్’ పైర‌సీ వెర్ష‌న్‌ను ప్ర‌ద‌ర్శించిన‌ట్లు తెలిసింది. ఇది చ‌ట్ట‌విరుద్ధం, అన్యాయం. మూవీ కోసం రాత్రింబవళ్లు క‌ష్ట‌ప‌డిన వారిని అవమానించినట్లే అవుతోంది. ఒక చిత్రం ఎంతోమంది ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, ఆర్టిస్టుల క‌ల’ అని బ‌న్నీవాసు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని APSRTC ఛైర్మన్‌ను నిర్మాత బ‌న్నీవాసు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment