తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’ (Jananaayagan)కు సంబంధించిన కీలక పరిణామం ఈరోజు చోటుచేసుకోనుంది. సినిమా సెన్సార్ సర్టిఫికేట్ జారీ విషయంలో తలెత్తిన వివాదంపై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఈరోజు మధ్యాహ్నం 2:15 గంటలకు తుది విచారణకు తీసుకోనుంది. ఇప్పటికే సీబీఎఫ్‌సీ (CBFC )సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) సినిమా చూసి సూచించిన కట్స్, మ్యూట్స్ పూర్తి చేసినప్పటికీ సర్టిఫికేట్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుండటంతో, నిర్మాత సంస్థ KVN ప్రొడక్షన్స్ (KVN Productions) అత్యవసరంగా కోర్టును ఆశ్రయించింది.
చిత్ర బృందం వాదన ప్రకారం, విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండగా సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం కావడం వల్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేకపోవడం, థియేటర్లతో ఒప్పందాలు నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు, ఈ వ్యవహారంపై రాజకీయ కోణం ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈరోజు తీసుకునే నిర్ణయమే ‘జననాయగన్’ సినిమా జనవరి 9న విడుదలవుతుందా లేదా వాయిదా పడుతుందా అన్నదాన్ని తేల్చనుంది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో, కోర్టు తీర్పుపై అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.








