అమెరికాలో ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారీ ఎదురుదెబ్బ తగిలింది. అగంతకులు టెస్లా షోరూమ్‌కి నిప్పుపెట్టడంతో పలు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలంలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. అయితే, ఒక కారుపై అనుచిత వ్యాఖ్యలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది ఉగ్రదాడే – మస్క్ ఘాటు స్పందన
ఈ ఘటనపై టెస్లా అధినేత ఎలన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తూ, ఇది తనపై కావాలని జరిపిన కుట్ర అని పేర్కొన్నారు. ప్రస్తుతం మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యయాలు తగ్గించేందుకు ట్రంప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ బాధ్యతలను మస్క్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఫెడరల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించడంతో ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మస్క్ ఆరోపించినట్లుగా ఇది ఉగ్ర చర్యనా? లేక ఇంకా ఏదైనా కారణముందా? అన్న కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే అసలు విషయాలు వెలుగు చూడనున్నాయి.







