ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో నిర్వహించబడే కుంభమేళా ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. అయితే, ఈసారి కుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సాధువుల రూపంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం రావడంతో, యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
జనవరి 13 తేదీ నుంచి ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు సంబంధించి భద్రతా చర్యలు కఠినంగా అమలుచేయబడుతున్నాయని పోలీసులు తెలిపారు. ప్రతి భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నామని, కుంభమేళా జరిగే ప్రాంతంలో అన్ని మూలల్లో నిఘా వాహనాలు, సీసీటీవీలు అమర్చారు. మేళాలో పాల్గొనే సాధువులు, భక్తులు ఎలాంటి అనుమానాస్పద చర్యలు గమనించినా వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసు శాఖ కోరుతోంది. భక్తులకు భద్రతతో పాటు ఆధ్యాత్మిక అనుభూతి కల్పించడమే ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం, పోలీసులు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నట్లు వివరించారు.