అధికార తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే అనుచరుడు ఆలయంలో దొంగతనం చేసిన సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆలయంలో దొంగతనం కేసు కలకలం రేపుతోంది. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) అనుచరుడు ఏలూరి చెన్నయ్య (Eluri Chennayya) ఈ ఘటనకు కారణమని పోలీసులు గుర్తించారు.
తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చెన్నయ్య, పొన్నూరులోని సహస్ర లింగేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. గత నెల 23న గిద్దలూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనికోసం వెళ్లిన చెన్నయ్య, అక్కడే 15 కిలోల వెండి ఆభరణాలను అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దొంగిలించిన వెండిని చెన్నయ్య తన స్నేహితుడు బూర్లగడ్డ సుబ్రహ్మణ్యం సహాయంతో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కలసి పొన్నూరులో 4 కిలోల వెండి, తెనాలిలో మరో 7 కిలోల వెండి అమ్మినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రకాశం జిల్లా సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, చెన్నయ్య ఇంటిపై సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
ప్రస్తుతం చెన్నయ్య పరారీలో ఉన్నాడు. అయితే, చెన్నయ్యను కేసు నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర వర్గం పావులు కదుపుతోందన్న ప్రచారం జరుగుతోంది. దేవుడి ఆభరణాలు దొంగతనం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే అనుచరుడని విషయం బయటపడటంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారం ఇస్తే గుడినే కాదు, గుడిలో లింగాన్ని కూడా మింగేసేలా ఉన్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.








