మానససరోవరం యాత్రకు వెళ్లిన 21 మంది తెలుగువాళ్లు చైనా సరిహద్దులో చిక్కుకున్నారు. తమను సొంతూర్లకు చేర్చాలని వేడుకుంటూ బాధితులు వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఆహారం, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు.
ఈనెల 2న విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఈ బృందం మానససరోవరం యాత్రలో భాగంగా చైనాకు చేరుకుంది. ఆపై నేపాల్ మీదుగా భారత్ చేరుకోవాల్సి ఉంది. అయితే, నేపాల్‌లో అల్లర్లు ముదరడంతో టూర్ ఆపరేటర్ వారిని చైనా సరిహద్దు వద్దే నిలిపివేశాడు. దీంతో ప్రయాణం కొనసాగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు యాత్రికులు తెలిపారు.
“మేము భయానక పరిస్థితుల్లో ఉన్నాం. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని మాకు సహాయం చేయాలి” అని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం యాత్రికుల కుటుంబాలు ఆందోళన చెందుతూ, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.