తెలంగాణ (Telangana) రాష్ట్రానికి వాతావరణ శాఖ (Weather Department) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో, బుధ, గురువారాలకు సంబంధించి రెడ్ అలర్ట్(Red Alert) కూడా ప్రకటించింది. హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం (Weather Centre) డైరెక్టర్(Director) నాగరత్న (Nagaratna) ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
జిల్లాల వారీగా హెచ్చరికలు
రెడ్ అలర్ట్ : సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ కలర్ వార్నింగ్ జారీ చేశారు. హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఆరెంజ్ అలర్ట్ : హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇచ్చారు.
ఎల్లో అలర్ట్ : నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇతర ముఖ్య సూచనలు
రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
ఉత్తర తెలంగాణ: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంటుందని, ముఖ్యంగా ఈ నెల 17న వర్షాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
భారీ వర్షాల అంచనాలతో జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అప్రమత్తమైంది. సాయంత్రం నుంచి వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున, ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, మ్యాన్‌హోల్స్ మూతలను ఎవరూ తొలగించవద్దని హెచ్చరించింది.








