ఆదివాసీ నాయ‌కుడి ఫొటో తొల‌గింపు.. ‘గురుద‌క్షిణ’ అంటూ రేవంత్‌పై సెటైర్లు

ఆదివాసీ నాయ‌కుడి ఫొటో తొల‌గింపు.. 'గురుద‌క్షిణ' అంటూ రేవంత్‌పై సెటైర్లు

తెలంగాణ ప్రభుత్వం తాజాగా చేప‌ట్టిన ఓ చ‌ర్య బీఆర్ఎస్‌కు, ప్ర‌భుత్వ విమ‌ర్శ‌ల‌కు పెద్ద అస్త్రంగా మారింది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి ఆయ‌న మాతృ పార్టీకి లింక్ పెడుతూ అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్న స‌మ‌యంలో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకాల కవర్ పేజీలో తెలంగాణ ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీరుడు కొమురం భీమ్ ఫొటోను తొలగించి, దాని స్థానంలో సైబర్ టవర్స్ ఫొటోను చేర్చడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో “తెలంగాణ చరిత్రను తొక్కేసి, చంద్రబాబు సొంత‌ డబ్బా కొట్టుకునే సైబర్ టవర్స్ చరిత్రను పెట్టారు” అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్య రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు నాయుడికి గురుదక్షిణ తీర్చే ప్రయత్నమని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

కొమురం భీమ్ ఆదివాసీ సమాజానికి గుర్తుగా నిలిచిన పోరాట యోధుడు, జల్-జంగల్-జమీన్ కోసం బ్రిటిష్, నిజాం పాలనలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర స్ఫూర్తిదాయకం. ఆయన ఫొటోను పాఠ్యపుస్తకం నుంచి తొలగించడం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, ఆదివాసీ చరిత్రను కించపరిచే చర్యగా విమర్శకులు చూస్తున్నారు. దాని స్థానంలో సైబర్ టవర్స్‌ను చేర్చడం, రాష్ట్ర గుర్తింపును ఆధునికత పేరుతో వాణిజ్యీకరణ దిశగా మళ్లించే ప్రయత్నమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ తెలంగాణ సంస్కృతిని బలి చేస్తున్నాడు” అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రజలు, ఉద్యమకారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నిర్ణయం రాజకీయ కక్షతో కూడినదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు.

ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ ఉద్యమం, ఆదివాసీ హక్కుల పోరాటాలను తొక్కివేసే ఉద్దేశంతోనే జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “తెలంగాణను ఇంకెంతగా బలి చేస్తావు రేవంత్?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో, విద్యాశాఖ ఈ మార్పును సమర్థించుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ చర్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారులు, విద్యార్థి సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment