నాలుగేళ్ల విరామం తరువాత తెలంగాణ ఆర్టీసీ (TGS RTC)కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. 21 డిమాండ్లతో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసులు అందజేశారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సమ్మె మాత్రమే సరైన విధానమని, పోరాట పంథాను ఎంచుకున్నాయి. ఈ మేరకు సోమవారం బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిసి సమ్మె నోటీస్ అందజేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్లుగా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రెండు పీఆర్సీలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించి తమ డిమాండ్లకు హామీ పొందారు. కానీ ఆ సమ్మె సమయంలో పలు విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొంతమంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అప్పట్లో రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు వర్సెస్ ఆందోళనలు
2023 ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర గణనీయమైంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే కార్మికుల సమస్యలు పరిష్కారం కానందుకు వారు మరోసారి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న హామీలు అమలు కాకపోవడం, ఇప్పుడు కాంగ్రెస్ హయంలో కూడా కార్మికుల డిమాండ్లపై స్పందన లేనందుకు నిరసన వ్యక్తమవుతోంది.