తెలంగాణ (Telangana)లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి) (SIB) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు (T. Prabhakar Rao) లాప్టాప్ (Laptop), సెల్‌ఫోన్‌లను (Cellphones) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) (SIT) సీజ్ (Seized) చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారింది. సీజ్ చేసిన లాప్టాప్, సెల్‌ఫోన్‌లను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) (FSL)కు పంపిన సిట్, 2023 అక్టోబర్ నుంచి మార్చి 15 వరకు కాల్ డేటాలోని రహస్యాలను ఛేదించే పనిలో నిమగ్నమైంది.
ప్రభాకర్ రావు 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు సర్వీస్ ప్రొవైడర్ డేటా ఆధారంగా 618 ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లు చెబుతున్నారు. ప్రభాకర్ రావు పోలీసు ఉన్నతాధికారులు, బీఆర్ఎస్(BRS) నాయకులతో జరిపిన సంప్రదింపులు కూడా సిట్ దృష్టికి వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ విచారిస్తోంది. రేపు (జూలై 10) మరోసారి ఆయన సిట్ ముందు హాజరుకానున్నారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రధానంగా కొన్ని మీడియా సంస్థలే ముందుకు తీసుకెళ్తున్నట్లుగా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. విచారణలో ఉన్న కేసులోని అంశాలు మీడియా సంస్థలకు ఎలా లీక్ అవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణను తమ కథనాలు, ప్రసారాలతో మీడియా సంస్థలే మిస్‌లీడ్ చేస్తున్నాయా..? అని అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేటీఆర్ కుటుంబంపై అసభ్యకరమైన థంబ్‌నైల్స్‌తో ప్రచారం చేసిన ఓ టీవీ ఛానల్‌పై బీఆర్ఎస్‌వీ దాడి చేసిన విషయం తెలిసిందే.