కర్నూలు (Kurnool) జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం (Terrible Bus Accident)పై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సులను సరిగా తనిఖీ చేయకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రోజూ తనిఖీలు చేస్తే ‘వేధింపులు’ అంటూ విమర్శిస్తున్నారని, కానీ ఇలాంటి ప్రమాదాలు వాటి నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని అన్నారు.
ప్రమాద తీవ్రతపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి, మృతులకు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించడానికి త్వరలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రమాదాలకు కారణమయ్యే స్పీడ్ లిమిట్ వంటి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలో రిజిస్టర్ అయి, హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య తిరుగుతోందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.








