తెలంగాణ (Telangana) లో మరో పరువు హత్య (honor killing) సంచలనంగా మారింది. కూతుర్ని ప్రేమించాడన్న కారణంతో ఓ యువకుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి ఘటన పెద్దపల్లి జిల్లా (Peddapalli district) ఎలిగేడు మండలం ముప్పిరి తోట (Muppiri Thota) గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ (Porella Saikumar), అదే గ్రామానికి చెందిన ఓ యువతితో కొంతకాలంగా ప్రేమ (Love) లో ఉన్నాడు. కానీ కులాలు వేర్వేరుగా ఉండటంతో యువతి తండ్రి ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. సాయికుమార్‌ను హెచ్చరించినా, ఇద్దరూ మాట్లాడుకోవడం ఆపలేదు. కోపంతో రగిలిపోయిన తండ్రి, ప్రియుడిని హత్య చేయాలని పథకం వేసి అమలు చేశాడు.
ఆలయం వద్ద దారుణం..
గురువారం రాత్రి 10 గంటల సమయంలో, సాయికుమార్ వెంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) ఆలయం వద్ద తన స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో యువతి తండ్రి గొడ్డలి (Axe) తో అక్కడికి వచ్చాడు. ఒక్కసారిగా అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి, తీవ్ర గాయాలు కలిగించాడు. తీవ్రంగా గాయపడిన సాయికుమార్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ హత్య సాయికుమార్ పుట్టినరోజునే జరగడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకున్న పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.