గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం, అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసి, కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం
టీజీపీఎస్సీ (TGPSC) మెయిన్స్ పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలి. ఈ రీవాల్యుయేషన్ ఆధారంగానే ఫలితాలను తిరిగి ప్రకటించాలి. ఒకవేళ రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే, పరీక్షలను మళ్లీ నిర్వహించాలి అని ఆదేశించిన కోర్టు.. ఇప్పటికే విడుదలైన మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేసింది.
అభ్యర్థుల ఆరోపణలు
2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10న టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాలపై అభ్యర్థులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. జెల్ పెన్నులు వాడటం, కొన్ని నిర్దిష్ట పరీక్షా కేంద్రాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపిక కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపికవడం వంటి అంశాలపై వారు కోర్టును ఆశ్రయించారు.
అయితే, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా పరీక్షలు రద్దు చేయవద్దని పిటిషన్ వేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ తుది తీర్పును వెలువరించింది. మార్చి 10న మార్కులు ప్రకటించి, మార్చి 24 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం కల్పించిన టీజీపీఎస్సీ మార్చి 30న జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో 563 పోస్టుల భర్తీ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.







