తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ (Weather Department) హెచ్చరికలు జారీ చేసింది. వాయవ్య (Northwest) బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ఆవర్తన ద్రోణి (Cyclonic Circulation) ప్రభావంతో రాష్ట్రంలో రెండు నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం (Weather Center) స్పష్టంచేసింది.
ఈ క్రమంలో శనివారం (జూలై 12) నాడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది.
అంతేకాకుండా 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. రేపు (జూలై 13) మరియు ఎల్లుండి (జూలై 14) కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముండగా, కొన్నిచోట్ల ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక జూలై 16వ తేదీ నుంచి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.







