పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో తెలంగాణ (Telangana)లో వర్షాలు (Rains) బీభత్సం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ (Weather Department) హెచ్చరికల ప్రకారం ఈ నెల 13 నుంచి 16 వరకు రాష్ట్రంలోని 17 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణను వర్షాపాతం ముంచెత్తుతోంది. మళ్లీ ఇప్పుడు అతిభారీ వర్షాల హెచ్చరిక ప్రజలను భయపెడుతోంది.
అధిక వర్షపాతం నమోదు
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఎక్కువ ప్రభావితమవనున్న ప్రాంతాలుగా గుర్తించారు.
ఇప్పటికే ఆదివారం నాడు నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 11.05 సెంటీమీటర్లు, సూర్యాపేటలో 8.93 సెంటీమీటర్లు, ఆదిలాబాద్‌లో 7.28 సెంటీమీటర్లు, వరంగల్‌లో 6.70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏపీలోనూ వానల దాడి
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూడా వానలు జోరందుకోవచ్చని అంచనా. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 40–50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీయనున్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల కారణంగా రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు.







