ఢిల్లీలో పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ(PM Narendra Modi)తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు అవసరమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపు సహా పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఫేజ్-2 మెట్రో ఎయిర్‌పోర్ట్ లైన్ విస్తరణ (Metro Expansion), మూసీ నది సుందరీకరణ, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్((RRR Project))లకు కేంద్రం నుంచి అనుమతులు, ఆర్థిక సహాయం కోసం ప్రధానిని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు, తెలంగాణకు ఐటీఐఆర్, ఐఐఎం స్థాపనకు అనుమతులు కోరారు.
కుల గణన, ఎస్సీ వర్గీకరణపై ప్రస్తావన
బీసీ కుల గణన బిల్లు కేంద్రానికి పంపిన తర్వాత దానికి ఆమోదం తెలపడం, అలాగే ఎస్సీ వర్గీకరణ అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి అమలు చేసే అవకాశం ఉందని ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీ తెలంగాణకు అభివృద్ధి ప్రాజెక్టులకు పునాదిగా మారే అవకాశముందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.








