తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉత్కంఠగా మారింది. సంక్రాంతి పండుగ నాటికి కొత్త సారథి పేరు ఖరారు చేయాలని అధిష్టానం యోచిస్తోందట. ప్రతిరోజూ కొత్త పేర్లు చర్చలోకి వస్తుండగా, MPగా ఉన్న BC నేతకు అధిక అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎవరికి అవకాశం?
అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, పలువురు సీనియర్ నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, DK అరుణ, రఘునందన్ రావు, ఎన్. రాంచంద్రరావు వంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, సీనియర్ నేతలతో పాటు కొత్త నేతను ముందుకు తెచ్చే అవకాశాలూ ఉన్నట్లు తెలుస్తోంది.
నేతల అభిప్రాయ సేకరణ పూర్తయిందా?
BJP అధిష్టానం ఇప్పటికే రాష్ట్రంలోని MLAలు, MPలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను సేకరించింది. కొత్త నాయకుడు ఎవరు అయినా, పార్టీ బలోపేతానికి పనిచేసేలా ఆయన ఎంపిక జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంక్రాంతి తర్వాత స్పష్టత
కొత్త అధ్యక్షుడి ఎంపికతో తెలంగాణ BJPలో కొత్త శకం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఆ పార్టీ భవిష్యత్తు ప్రణాళికలకు ఎంతో కీలకం కానుంది. రాష్ట్రంలో BJP బలపడి, తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఈ సారథి మార్పు ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది.