హైదరాబాద్ (Hyderabad)కు సమీపంలో ‘భారత్ ఫ్యూచర్’ (India Future) అనే కొత్త నగరాన్ని నిర్మించనున్నట్లు తెలంగాణ (Telangana ) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఢిల్లీ (Delhi)లో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (Public Affairs Forum Of India) 12వ వార్షిక సదస్సులో ‘విజన్ తెలంగాణ రైజింగ్ 2047’ (Telangana Rising 2047) అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ కొత్త నగరం 9 రంగాలకు ప్రత్యేక కేంద్రంగా ఉంటుందని, భవిష్యత్ తరాలకు అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారికి తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని, పెట్టుబడిదారులకు పూర్తి భద్రత ఉంటుందని చెప్పారు. పెట్టుబడులు పెట్టే సంస్థలు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.
తనకు ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ (Young India Skill University)ని ఏర్పాటు చేయాలన్నది ఒక కల అని, మహాత్మా గాంధీ (Mahatma Gandhi) స్ఫూర్తితో ఈ ప్రాజెక్టును చేపడతామని సీఎం వెల్లడించారు. ఈ యూనివర్సిటీలో చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అలాగే, ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, దీని ద్వారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని తెలిపారు.
తెలంగాణకు సముద్ర తీరం లేనందున, మచిలీపట్నం పోర్టు వరకు రైల్వే లైన్‌తో కూడిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని కోరారు. అలాగే, 2025 డిసెంబర్ 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు.







