బీసీ రిజర్వేషన్.. తెలంగాణ ప్రభుత్వానికి ‘సుప్రీం’ షాక్

బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ సర్కార్ కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

బీసీ రిజర్వేషన్ల (BC Reservations)కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) హైకోర్టు (High Court) ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. గురువారం జరిగిన వాడి వేడి వాదనల అనంతరం ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.

స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్‌ 9ను జారీ చేసింది. అయితే, ఈ జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే (Stay విధించి, తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈలోగా పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. దీంతో, 42 శాతం బీసీ రిజర్వేషన్లను ప్రతిష్టాత్మకంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

సుప్రీం కోర్టు తీర్పు

జస్టిస్ విక్రమ్ నాథ్ (Vikram Nath), జస్టిస్ సందీప్ మెహతా (Sandeep Mehta) ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. వాదనలు విన్న తర్వాత, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగుతుందని, అక్కడే ఈ అంశాన్ని తేల్చుకోవాలని పిటిషనర్‌ తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది.

వాదనలు ఇలా ఉన్నాయి:

తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది (అభిషేక్ సింఘ్వీ): రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించామని తెలిపారు. డేటాబేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించామని, సుప్రీంకోర్టు విధించిన ‘ట్రిపుల్‌ టెస్ట్‌’ నిబంధనను అమలు చేశామని తెలిపారు.

ప్రతివాది తరపు న్యాయవాది (మాధవరెడ్డి తరఫు లాయర్): రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసిందని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ ఏరియాలు, గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచడానికి అనుమతి ఉందని, తెలంగాణలో అలాంటి ప్రాంతాలు లేవని తెలిపారు. కృష్ణమూర్తి కేసుతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కూడా రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించిందని వాదించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment