తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
‘హైకోర్టులో ఉన్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు?’
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “ఈ కేసు ఇప్పటికే హైకోర్టులో విచారణలో ఉండగా, మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చారు?” అని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ, రిజర్వేషన్లపై స్టే ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించిందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అయితే, దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. “హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే, నేరుగా ఇక్కడికి వస్తారా?” అని ప్రశ్నించింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై మళ్లీ తెలంగాణ హైకోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా, న్యాయమూర్తులు కేసును ‘డిస్మిస్’ చేయనున్నట్లు చెప్పడంతో.. పిటిషనర్ తరపు న్యాయవాది ఆ కేసును వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో, బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్లైంది.







