‘బీసీ బంద్’ ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు

డిపోలకే పరిమితమైన బస్సులు.. 42% రిజర్వేషన్లపై బీసీల బంద్.

నేడు తెలంగాణ బంద్‌ (Telangana Strike)కు బీసీ సంఘాల (BC-Communities) జేఏసీ (JAC) పిలుపునిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్‌ను ప్రకటించారు. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు దీనికి మద్దతుగా నిలుస్తున్నాయి.

ఈ బంద్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులు (RTC Buses) డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ (Hyderabad)లో ఆర్టీసీ బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోజూ సుమారు 3500 బస్సుల రాకపోకలు సాగే ఎంజీబీఎస్ (మహాత్మా గాంధీ బస్ స్టేషన్) నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది.

ఎంజీబీఎస్ ముందు బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. అదే విధంగా జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) లోనూ బీసీ సంఘాల నేతలు బైఠాయించారు. జేబీఎస్ దగ్గర బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) బంద్‌లో పాల్గొన్నారు. రాజేంద్రనగర్, దిల్‍సుఖ్‍నగర్, బండ్లగూడ, హయత్‌నగర్, బర్కత్‌పురా, ఇబ్రహీంపట్నం సహా పలు ఆర్టీసీ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి.

దిల్‍సుఖ్‍నగర్‌లో బీసీ సంఘాలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. ఈ సందర్భంగా సంఘం నేతలు ప్రైవేట్ బస్సులు, ప్రైవేటు వాహనాలను అడ్డుకోవడంతో నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మరోవైపు, ఈ బంద్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండ్‌లలో భారీ సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు సైతం అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్ వాహనదారులు అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment