బీహార్‌లో మహాఘట్‌బంధన్ (ఇండియా కూటమి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు ఈనెల 14న వెలువడతాయని, ఆ తర్వాత నవంబర్ 18నే ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లిన ఆయన, మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడగానే మార్పు వస్తుందని చెప్పారు. కులమతాలకు అతీతంగా నవంబర్ 26 నుంచి రాష్ట్రంలోని నేరస్థులందరినీ జైలుకు పంపిస్తామని తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, బీహార్‌లో తొలి విడత పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. మొదటి విడత పోలింగ్ నవంబర్ 6న (గురువారం), రెండో విడత పోలింగ్ నవంబర్ 11న (మంగళవారం) జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రతిపక్ష కూటమి తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగా, అధికార ఎన్డీఏ కూటమి మాత్రం ముఖ్యమంత్రి పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, నితీష్ కుమార్ నాయకత్వంలోనే మరోసారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.








