అనంతపురం (Anantapur) జిల్లా తాడిపత్రి (Tadipatri)లో టీడీపీ(TDP) అంతర్గత విబేధాలు మళ్లీ భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy), కమ్మ సంఘం నేత కాకర్ల రంగనాథ్ (Kakarla Ranganath) మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. తాజాగా, కాకర్ల రంగనాథ్ మరియు ఆయన ఇద్దరు సోదరులను పార్టీ నుంచి సస్పెండ్ (Suspend) చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించడంతో తాడిపత్రి రాజకీయాల్లో కలకలం రేగింది.
జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అసమ్మతి నేతలపై తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తూ “పార్టీ క్రమశిక్షణ తప్పిస్తే కఠిన చర్యలు తప్పవు” అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రమేయం లేకుండానే కాకర్ల సోదరులను సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవడంపై స్థానికంగా పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది నేతలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు జేసీకి అలాంటి అధికారం లేదని అంటున్నారు.
ఇక కాకర్ల రంగనాథ్ వర్గం తీవ్రంగా మండిపడింది. “జేసీ తాటాకు చప్పుళ్లకు మేం భయపడేది లేదు. పార్టీలో కానీ, ప్రజల్లో నిజాలు బయటకు వస్తాయి” అని రంగనాథ్ అనుచరులు ప్రకటించారు. కమ్మ సామాజిక వర్గం ప్రతినిధులు కూడా జేసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విబేధాలతో తాడిపత్రి టీడీపీ మళ్లీ రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది.








