అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలు పూర్తి కావొస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పరిపాలన అంటే ఏంటో చూపిస్తామని, అనుభవంతో అన్నింటినీ చక్కదిద్దుతామని ఆర్భాటంగా మూడు పార్టీల కూటమి నేతలు మీటింగ్ పెట్టుకొని మరీ ప్రకటించారు.
రోజులు గడుస్తున్నా కొద్దీ ప్రతి అంశాన్ని వైసీపీపై నెట్టే ప్రయత్నం మొదలుపెట్టేశారు. అంగన్ వాడీల నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు, పీహెచ్‌సీ నుంచి పెద్దాస్పత్రి వరకు, కాలిన యూనిట్ నుంచి విద్యుత్ మీటర్ల వరకు, బడి నుంచి గుడి వరకు ఏ ఫిర్యాదు అందినా, ఎన్ని వినతులు వచ్చినా గత ప్రభుత్వ తప్పిదమే అని చెబుతున్నారు. ఆఖరికి నీట మునిగిన బోటుపై కూడా కూటమి ఏర్పడ్డాక వైసీపీపై రాళ్లు వేసే ప్రయత్నం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఓ వింత ఘటన ఈ జాబితాలోకి వచ్చి చేరింది.
అదేంటంటే.. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదనను ఆ పార్టీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మైదుకూరు సభలో ప్రస్తావించారు. అందుకు చంద్రబాబే సాక్ష్యం. ఆ తరువాత ఒక్కొక్కరుగా ఆ ప్రతిపాదనను పార్టీ డిమాండ్ స్థాయికి తీసుకెళ్లారు. ఆ తరువాత జనసేన రియాక్షన్స్ మొదలవ్వడంతో తమ్ముళ్లూ తగ్గాలంటూ టీడీపీ ఆఫీస్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది.
ఈ అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న వాదన వైసీపీ మొదలుపెట్టిందట. ఆ డిమాండ్‌ను తెరపైకి తెచ్చి కూటమిలో విభేదాలు సృష్టించాలని చూస్తోందని, ఇదంతా వైసీపీ కుట్ర అని ఆయన వ్యాఖ్యానించారు. కొసమెరుపుగా కూటమి నేతలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా.
పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలపై ఆ పార్టీ శ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, పార్టీ డిమాండ్‌ను కూడా ప్రతిపక్ష పార్టీపై నిందలా వేయడం పల్లాకే చెల్లిందంటూ కొందరు సెటైర్లు పేలుస్తున్నారు. మైదుకూరులో చంద్రబాబు సాక్షిగా జరిగిన విజ్ఞప్తిని వైసీపీకి అంటగట్టడం విస్తుగొలిపించే విషయమే.