ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ ఎంపీ, ముఖ్యమంత్రి కార్యాలయ కీలక అధికారి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, సీఎంవో అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా మధ్య ఢిల్లీలో ఘర్షణాత్మక వాగ్వాదం చోటుచేసుకుందనే వార్త ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది. పరస్పరం మాటల దాడులు, ఫిర్యాదులు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజున ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. సీఎం చంద్రబాబును కలవడానికి ఎదురు చూస్తున్న టీడీపీ ఎంపీ శబరికి, ‘‘సీఎం బిజీగా ఉన్నారు’’ అని ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా చెప్పడంతో ఆమె ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ‘‘నేనొక ఎంపీని.. నాతో ఇలాగేనా మాట్లాడేది’’ అంటూ గట్టిగా అరిచారట. దీనికి ఆయన కూడా అదే తీరులో స్పందిస్తూ ‘‘నీలా ఎవరూ ఇప్పటిదాకా నాతో ఇలా మాట్లాడలేదు’’ అని మండిపడ్డారని, ఆ ఏకవచనం పిలుపుతో ఎంపీ శబరి మరింత ఆగ్రహించి, మర్యాదగా ప్రవర్తించాలని హెచ్చరించారని పలు వార్త పత్రికలు, నేషనల్ మీడియా కూడా ఈ అంశాన్ని హైలైట్ చేసింది.
టీడీపీ ఎంపీ శబరి – సీఎంవో కీలక అధికారి కార్తికేయ మిశ్రా మధ్య పరిస్థితి మరింత ముదరకముందే కొందరు వ్యక్తులు జోక్యం చేసుకొని ఎంపీని అక్కడి నుంచి తీసుకెళ్లారట. అయితే ఈ ఘటనపై ఎంపీ శబరి మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కార్తికేయ మిశ్రా, లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. ఈ కారణంగానే ఆయనను సీఎంవోలో అదనపు కార్యదర్శిగా నియమించారని చెబుతున్నారు. అయితే తాజా వివాదం పెద్దదవుతుండటంతో, సీఎంవో ఒక సీనియర్ అధికారికి ఈ వ్యవహారంపై విచారణ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.
