తన చర్యలతో పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కేడర్ నుంచి వరుస ఫిర్యాదులు అందుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎమ్మెల్యే తీరులో వివాదాలు
తన నియోజకవర్గంలో అధికారుల పరిమితుల్లోనూ జోక్యం చేసుకుంటూ అనేక సందర్భాల్లో వివాదాలకు కారణమవుతున్నారని కేడర్ ఆరోపిస్తోంది. కొలికపూడి వ్యవహార శైలి స్థానికంగా ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు.
కంభంపాడులో అధికారుల చొరవకు విరుద్ధంగా భవనం కూల్చివేతలో ఎమ్మెల్యే వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు గురైంది. ఓ ప్రజా ప్రతినిధి సతీమణి ఆత్మహత్యాత్నానికి కొలికపూడి దూషణలే కారణమన్న ఆరోపణలతో పెద్ద వివాదం తలెత్తింది. తిరువూరులో స్థానిక నెలకొన్న మద్యం దుకాణాలను తన సొంత నిర్ణయంతో తాళాలు వేయించి వివాదం సృష్టించారు. ఈ వివాదాల నేపథ్యంలో చంద్రబాబు ఆయనను పిలిచి దూకుడు తగ్గించాలని సూచించినప్పటికీ, కొలికపూడి తీరులో మార్పు రాలేదని కేడర్ చెబుతోంది.
పార్టీకి నష్టం.. సొంత పబ్లిసిటీ?
మద్యం దుకాణాలు మూసివేయడం, తనదైన శైలిలో ప్రజా సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలు ప్రస్తుతం ప్రజల దృష్టిని ఆకర్షించినా, స్థానికంగా టీడీపీ కేడర్ మాత్రం ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇకపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే చర్యల వల్ల స్థానికంగా పార్టీకి కలిగే నష్టాన్ని నివారించేందుకు మరింత సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.