తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక తెలుగుదేశం కార్యకర్త డేవిడ్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పార్టీ కోసం కష్టపడిన తనను అక్రమ కేసులతో వేధిస్తున్నారని, ఈ ఘటనకు ముందు డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి కారణాలను వెల్లడించాడు. ప్రస్తుతం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యే కొలికపూడి ఈ అంశాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించారని, అందరినీ బెదిరించారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడి కేంద్రంగా తిరువూరులో జరుగుతున్న వరుస ఘటనలు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే వివాదాస్పద వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తుండగా, ఇటీవల ఆయనకు టీడీపీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసి విచారించింది. అయినా ఆయన తీరు మారలేదని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ అంశంపై తెలుగుదేశం అగ్ర నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.