తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎంపీ కేశినేని చిన్నీ (Kesineni Nani) గురించి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivas Rao) సంచలన విషయాలను బయటపెట్టాడు. మంత్రి నారా లోకేష్(Nara Lokesh)కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఎంపీ చేస్తున్న వ్యవహారాల గురించి విని ఆ పార్టీ అనుకూల మీడియా ప్రతినిధి అవాక్కయ్యాడు. ఓ టీవీ ఛానెల్ డిబేట్‌కు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న అక్రమ దందాలను బయటపెట్టడం సంచలనంగా మారింది. పేకాట శిబిరాలు (Gambling Camps), గంజాయి విక్రయాలు, కౌన్సిలర్ల కొనుగోలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో మోసాలు వంటి బాగోతాలను ఎమ్మెల్యే బహిర్గతం చేశాడు.
అనుచరులతో గంజాయి వ్యాపారం..
‘గంజాయి వ్యాపారం (Ganja Business) చేసేది కేశినేని చిన్నీ మనుషులే. గతంలో గంజాయి విక్రయించి మానేసిన వారి ఇళ్లకు వెళ్లి బెదిరించి మరీ గంజాయి విక్రయాలను ఎంపీ కేశినేని చిన్నీ మనుషులు ప్రొత్సహిస్తున్నారు. తిరువూరులో నేను గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ చేశాను. గంజాయి విక్రయించే చిన్నీ మనుషులు ప్రతిరోజూ ఆయన ఆఫీస్‌లోనే కూర్చుంటారు. భద్రాచలం నుంచి గంజాయి తెచ్చి తిరువూరులో అమ్ముతున్నారు’.
హైదరాబాద్, ఢిల్లీలో పేకాట..
‘ఎంపీ కేశినేని చిన్నికి పేకాట నుంచే వచ్చేది ప్రధాన ఆదాయం. హైదరాబాద్, ఢిల్లీల్లో పేకాట ఆడించి డబ్బులు సొమ్ముచేసుకుంటాడు. తిరువూరులోనూ పేకాట శిబిరాలు పెట్టాలని చూస్తే నేను ఒప్పుకోలేదు. అందుకే నాపై కుట్ర చేస్తున్నాడు’.
కన్సల్టెన్సీ పేరుతో మోసం..
‘ఒక సామాజిక వర్గానికి చెందిన 400 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను కేశినేని చిన్నీ మోసం చేశాడు. కన్సల్టెన్సీ పేరుతో ఉద్యోగాలిస్తామని నమ్మించి ఏకంగా 400 మందిని మోసం చేశాడు. నేటికీ బాధిత కుటుంబ సభ్యుల తల్లిదండ్రులు హైదరాబాద్‌లో కేశినేని చిన్నీ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తున్నారు. ఈ అంశం గురించి తనను ఎవరైనా కలవాలనుకుంటే హైదరాబాద్ ఆఫీస్‌కు రావొచ్చు అని కావాలంటే చిన్నీతో ఒక్క స్టేట్‌మెంట్ ఇప్పించండి’.
డబ్బులిచ్చి కౌన్సిలర్లను కొన్నాం
‘అవును, తిరువూరు మున్సిపాలిటీలో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లను డబ్బులిచ్చి కొనుగోలు చేశాం. కేశినేని చిన్నీ ఆఫీస్‌లో కూర్చునే ఒక వ్యక్తి సమకూర్చిన డబ్బు ద్వారా తిరువూరు వైసీపీ కార్పొరేటర్లను కొనుగోలు చేశాం. ఇది వాస్తవం’ అని టీడీపీ అనుకూల మీడియాగా గుర్తించే టీవీ ఛానెల్ డిబేట్‌లో ఎంపీ చిన్నీకి సంబంధించిన సంచలన విషయాలను టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు బహిర్గతం చేశాడు.
ఎంపీ కేశినేని చిన్నీ బాగోతం గురించి కొలికపూడి చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంత్రి లోకేష్ అండదండలతో ఎంపీ చిన్నీ అనేక దారుణాలకు పాల్పడుతున్నాడని సొంత పార్టీ నేతలే బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. పసుపు సైనికుడిని అంటూనే సైన్యానికి మచ్చ తెస్తున్నాడని మండిపడుతున్నారు.





 



