ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో తెలుగు దేశం (Telugu Desam) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్నప్పటికీ, పరిపాలన తీరు పట్ల ఇటు ప్రజల్లో అసంతృప్తి, అటు సొంత పార్టీలో ఆధిపత్య పోరు ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ విషయాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకున్నారని సమాచారం. కొంతమంది మంత్రులు (Ministers), ఎంపీలు (MPs), ఎమ్మెల్యేలు (MLAs) తీసుకుంటున్న నిర్ణయాలు, మేనేజ్‌మెంట్‌లో లోపాలు, ప్రజలకు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలపై అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ క్రమంలో పలుసార్లు నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రైవేట్ సంస్థలు (Private Organizations) చేసిన సర్వేలు (Surveys) ముఖ్యమంత్రి వరకు చేరాయి.
ఈ నివేదికల్లో 53 మంది ఎమ్మెల్యేలు(MLA’s) రెడ్ జోన్ (Red Zone)లో ఉన్నారని, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో 90 మంది ఆరెంజ్ జోన్‌లో ఉండగా, కేవలం 32 మంది మాత్రమే గ్రీన్ జోన్‌లో ఉన్నట్టు రైజ్ సంస్థ చేసిన అధ్యయనం వెల్లడించింది. ఈ క్రమంలో ముఖ్య నేత ఓ నలుగురు ఎమ్మెల్యేలకు ఇటీవల క్లాస్ పీకారు. త్వరలోనే మరికొంత మందికి ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు రావొచ్చు అన్న కామెంట్స్ అధికార పార్టీ సర్కిల్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
కలవరపాటు మొదలైందా..?
ఏడాది పాలనలో కొంత మంది నేతలు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారన్న సమాచారం అధిష్టానం దృష్టికి చేరింది. దీంతో అధినేత రంగంలోకి దిగారని, పలువురుపై క్రమశిక్షణ చర్యలకు తెర లేపారని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గాన్ని ప్రత్యక్షంగా పార్టీ ఇన్‌చార్జిలే నడిపించేలా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచన కూడా అధినేత పరిశీలనలో ఉందట. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నుకోబడిన 52 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది పనితీరు నిరుత్సాహకరంగా ఉందన్న విషయం అధిష్టానాన్ని మరింత కలవరపెడుతోంది.
తలనొప్పిగా వర్గపోరు
రాయలసీమ జిల్లాల్లో రాజకీయ వర్గపోరు, నేతల మధ్య సమన్వయ లోపాలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. అన్నమయ్య జిల్లాలోనూ టీడీపీ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరినట్లుగా సమాచారం. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గంలో ఇటీవల తలెత్తిన ఘర్షణలు పార్టీ పరువు మీద ప్రభావం చూపించాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గీయులు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై దాడికి దిగడం సంచలనం రేపింది. ఒక్కసారిగా వర్గవిభేదాలు భగ్గుమనడంతో పార్టీ అధిష్టానం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల నాయకులకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో పరిస్థితి మరోలా ఉంది. ప్రతి పనికి ‘బీ’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలే అధిష్టానికి ఫిర్యాదు చేయగా, తాజాగా ఓ ఎంపీటీసీ, ఆమె భర్త పార్టీని వీడారు. ఈ క్రమంలో పార్టీని చక్కబెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సొంత పార్టీలో టాక్.
నాయకత్వం మారుతుందా..?
శ్రీశైలం, ఆదోని, ఆలూరు, నంద్యాల, పాణ్యం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో వర్గపోరు, నేతల మధ్య అసహకారం అధిష్టానాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు నేతలు సమన్వయంతో కాకుండా స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండటం పార్టీకి కలిగే నష్టాన్ని పెంచుతోంది. ఈ నేపథ్యంలో నాయకత్వ మార్పులు జరుగుతాయా? పార్టీ లోపలే బాధ్యతల పునర్విభజన జరుగుతుందా? అనే చర్చలు ఇప్పుడు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు కీలకమవుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.