జ‌న‌సేన ఎమ్మెల్యేపై టీడీపీ నేత‌ల ఆగ్ర‌హం.. మంత్రికి ఫిర్యాదు

జ‌న‌సేన ఎమ్మెల్యేపై మంత్రికి టీడీపీ నేత‌ల ఫిర్యాదు

అవనిగడ్డ నియోజ‌క‌వ‌ర్గంలో కూటమి పార్టీల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ ఏకంగా స్టేజీ మీద మంత్రి ఎదుటే అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ నేత‌లు మండిపడ్డారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ముందే జ‌న‌సేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబ దోపిడీని బ‌య‌ట‌పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఎమ్మెల్యే కుటుంబ అవినీతిపై టీడీపీ నేత‌లు గ‌గ్గోలు పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది.

అవ‌నిగ‌డ్డ‌లోని చల్లపల్లిలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మికి పెద్ద‌న్న పాత్ర పోషించాల్సిన జ‌న‌సేన ఎమ్మెల్యే మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ పొత్తు ధ‌ర్మం పాటించ‌డం లేద‌ని టీడీపీ నేత‌లు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎదుటే గోడు వెల్ల‌బోసుకున్నారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో తమకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదంటూ వాపోయారు.

టీడీపీ వల్ల తాను గెలవలేదని ఎమ్మెల్యే త‌మ‌ను పదే పదే అవమానిస్తున్నారని, ప్రభుత్వం అధికారంలో ఉండి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నామ‌ని, వైసీపీ ప్రభుత్వంలో త‌మ‌కు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదని మండిప‌డ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఏ చిన్న పనిమీద వెళ్లినా అధికారులు గౌరవించేవారని, కానీ, కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక త‌మ‌ను అవమానిస్తున్న ఎమ్మెల్యేతో ఎలా కలిసి పనిచేయాలని మంత్రి ఎదుటే టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్నించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇసుక, మట్టిని ఎమ్మెల్యే కుటుంబం దోచుకుంటోంది.. మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు అని తెలుగుదేశం పార్టీ నేత‌లు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎదుట మాట్లాడిన వీడియో వైర‌ల్ అవుతోంది. టీడీపీ కార్యకర్త ఎవరైనా ట్రక్కు మట్టి సొంత పొలం నుంచి ఇంటికి తోలుకున్నా అధికారులను ఉసిగొల్పుతున్నారని, ఇసుక, మట్టి అక్రమ రవాణా గురించి పోస్టు పెట్టినందుకు కోడూరు మండల తెలుగు యువత నాయకుడిపై కేసు పెట్టించారని ఆరోపించారు. తక్షణమే అవనిగడ్డ నియోజవర్గానికి టీడీపీ ఇన్‌చార్జ్‌ని నియమించాలని ఆ పార్టీ నేత‌లు డిమాండ్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment