వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజినీ మామపై హత్యాయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. చిలకలూరి పేటలోని పురుషోత్తపట్నం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విడదల రజినీ మామ లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న కారుపై మెరుపుదాడికి దిగారు. పురుషోత్తపట్నం నుంచి వేణుగోపాలస్వామి ఆలయం వైపునకు లక్ష్మీనారాయణ కారు వెళ్తుందని టీడీపీ కార్యకర్తలు సమాచారం అందుకున్నారు. ఆ కారులో లక్ష్మీనారాయణ ఉన్నాడని భావించి ఒక్కసారిగా ఆయన కారుపై దాడికి పాల్పడ్డారు.

డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారును వేగంగా నడిపి టీడీపీ శ్రేణుల నుంచి తప్పించుకున్నాడు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కాగా, ఈ ఘటనపై విడదల రజినీ కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తన మనుషుల చేత లక్ష్మీనారాయణను హత్య చేసేందుకు ప్రయత్నించాడని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

గత కొంతకాలంగా చిలకలూరిపేటలో విడదల రజినీ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు టార్గెట్ చేసి వేధిస్తున్నారని తెలుస్తోంది. తన మామపై, తన మరిదిపై ఎమ్మెల్యే పుల్లారావు అక్రమంగా కేసులు బనాయిస్తున్నాడని మాజీ మంత్రి రజినీ ఇటీవల మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.








