టీడీపీ (TDP) నేత ముప్పవరపు వీరయ్య చౌదరి (Muppavarapu Veerayya Chowdary) దారుణ హత్య ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చేరుకున్న ఆయన, వీరయ్య చౌదరి మృతదేహానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఘటనపై ముమ్మర దర్యాప్తు – 12 బృందాల ఏర్పాటు
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, హత్య కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని తెలిపారు. ఇందులో స్థానికుల ప్రమేయమా? లేక కిరాయి గూండాలా? అనే దానిపై స్పష్టత కోసం 12 ప్రత్యేక బృందాలను (12 Special Investigation Teams) ఏర్పాటు చేశామని చెప్పారు. టీడీపీ పాలనలో హింసకు స్థానం లేదని, ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
ఆర్థిక లావాదేవీలేనా?
హత్య వెనక అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని సీఎం తెలిపారు. వ్యక్తిగత కక్షలు, ఆర్థిక వ్యాపారాలు, లేదా ఆయన రాజకీయ ఎదుగుదల తట్టుకోలేని కుట్రనా అన్న కోణాల్లో విచారణ జరుగుతోందన్నారు. ”హత్యలకు పాల్పడే వారిని ఉపేక్షించం. ఎవరికైనా ఈ ఘటనకు సంబంధించి సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్ 9121104784కి తెలియజేయండి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.