బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు (Gulf Countries) వెళ్లి ప్రమాదాల్లో భర్తలను కోల్పోయిన వితంతువులను టార్గెట్ చేస్తూ ఓ కీచకుడు దారుణాలకు పాల్పడుతున్నాడన్న వార్త ఏపీలో (Andhra Pradesh) సంచలనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి చెందిన నాయకుడినని చెప్పుకుంటూ, సహాయం కోసం ఎదురు చూసే మహిళలను బెదిరిస్తూ లైంగిక వేధింపులకు (Sexual Harassment) పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ బాధిత మహిళలు విజయవాడ టీడీపీ నేతలను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
విదేశాల్లో పనిచేస్తూ అకాల మరణం చెందన భర్తల మృతదేహాలను (Dead Bodies) స్వదేశానికి తరలించడం, అంత్యక్రియలకు (Funeral Rites) అవసరమైన ఏర్పాట్లు చేయిస్తానని నమ్మించి, “నా కోరిక తీర్చితేనే సహాయం” అన్న షరతులతో వితంతువులను వేధిస్తున్నాడని బాధిత మహిళలు వాపోతున్నారు. “మీరు ముఖ్యమంత్రికి చెప్పినా చివరకు నా దగ్గరకే రావాల్సిందే. సాయంత్రం కాసేపు నా ఇంటికి వస్తే అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు” అంటూ భయపెట్టి, బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు చెబుతున్నారు.
తాను చెప్పినట్టుగానే గల్ఫ్ నుంచి విజయవాడ వరకు అన్నీ నడుస్తాయంటూ అధికార బలాన్ని చూపిస్తూ మహిళలను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. భర్తలను కోల్పోయి అశ్రయంకోసం ఎదురుచూస్తున్న వితంతువులు, స్వదేశానికి తిరిగి రావడానికి సహాయం కోరిన మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నాడని బాధితులు తెలిపారు.
ఈ వ్యవహారంపై కొందరు బాధిత మహిళలు విజయవాడలోని టీడీపీ నాయకులకు ఫిర్యాదు చేశారు. తమలాంటి అనేక మంది మహిళల జీవితాలతో ఆ వ్యక్తి చెలగాటం ఆడుకున్నాడని, పార్టీ పేరు చెప్పుకుని కీచక పనులకు పాల్పడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకత్వాన్ని కోరుతున్నారు.
ఒక గల్ఫ్ దేశంలో కూడా టీడీపీ నాయకుడినని చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడిన అదే వ్యక్తిని అక్కడి ప్రభుత్వం 24 గంటల్లోనే దేశ బహిష్కరణ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ అతని తీరు మారలేదని, భారత్‌కు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా మహిళలను వేధిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
పార్టీ పేరు చెప్పుకుని వితంతువుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఇలాంటి ఘోరాలకు పాల్పడటం అత్యంత అమానుషమని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాధిత మహిళలు కోరుతున్నట్లుగా ఈ కీచకుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.








