వివాదంలో క‌డ‌ప రెడ్డ‌మ్మ‌.. తారాస్థాయికి పంచాయితీ (Video)

వివాదంలో క‌డ‌ప రెడ్డ‌మ్మ‌.. రోడ్డెక్కిన టీడీపీ నేతలు

40 ఏళ్లుగా పార్టీ కోసం ప‌నిచేస్తున్న త‌మ‌ను ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని టీడీపీ లోకల్ రాజకీయాల్లో అసమ్మతి మంటలు తీవ్రరూపం దాల్చాయి. కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆమె భర్త వైఎస్సార్ క‌డ‌ప‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తీరుపై బహిరంగ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సీనియర్ కార్యకర్తలు, నాయకులు సమావేశమయ్యారు.

కడపలోని దేవునికడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారికి ప్రార్థనలు చేశారు. అనంతరం వెంకటేశ్వరస్వామికి వినతిపత్రం అందజేశారు. ఆది నుండి పార్టీ జెండా మోసిన సీనియర్ కార్యకర్తలను పూర్తిగా పక్కనబెట్టి, ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన వారికి మాత్రమే ఎమ్మెల్యే మాధ‌వీ రెడ్డి ప్రాధాన్యత‌ ఇస్తోందని మండిపడ్డారు. తమకు అన్యాయం జరుగుతోందని, సీనియర్ల త్యాగాలను ఎమ్మెల్యే విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నడుమ, కమలాపురం సీనియర్ నేత పుత్తా నరసింహారెడ్డిని కలసి, తమకు న్యాయం జరిగేలా చూడాలని అస‌మ్మ‌తి నాయకులు నిర్ణయించారు.

ఇదే సమయంలో, గ‌తంలో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం, ఇటీవ‌ల ఆగస్టు 15 వేడుకల్లో కూడా తనకు కుర్చీ కేటాయించలేదంటూ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి చేసిన హంగామా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొత్తానికి, కడప టీడీపీ లోకల్ రాజకీయాల్లో అసమ్మతి మరింత వేడెక్కుతుండగా, సీనియర్లు-ఎమ్మెల్యే మధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment