అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం క్రితం నిశ్చితార్థం అయి త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిపై యాసిడ్‌తో దాడి చేయడమే కాకుండా బలవంతంగా గొంతలో పోశాడు. తరువాత కత్తితో పాశవికంగా దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మరింది. గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలోకి నెట్టేసింది. యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన గణేష్ అనే యువకుడు మదనపల్లిలోని టీడీపీ క్రియాశీలక నేత కుమారుడు.
నిందితుడు గణేష్ తండ్రి సంకారపు మురళి మదనపల్లె, కదిరి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సన్నిహితుడని, మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రధాన అనుచరుడైన మురళీకి టీడీపీలో సభ్యత్వం కూడా ఉన్న ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టార్చర్ తీవ్రమై ఉద్యోగం మానేసింది..
యాసిడ్ దాడిలో గాయపడిన యువతి ప్యారంపల్లెకు చెందిన దాసరి జనార్దన్, రెడ్డెమ్మల కుమార్తె గౌతమి (21). గౌతమి మదనపల్లెలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. బ్యూటీషియన్ కోర్సు అనంతరం మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో చేరింది. అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నేత మురళీ కొడుకు గణేష్ ప్రేమ పేరుతో గౌతమిని వేధించసాగాడు. అతని టార్చర్ తీవ్రమవ్వడంతో గౌతమి మూడు నెలల కిందట ఉద్యోగం మానేసి ప్యారంపల్లెకు వెళ్లిపోయింది. వారం క్రితం గౌతమికి తల్లిదండ్రులు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో నిశ్చితార్థం జరిపించారు. మరికొన్ని రోజుల్లో వివాహం జరగనుంది.

ఈ వార్త తెలుసుకున్న గణేష్.. ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకొని రెండు వారాలుగా ప్యారంపల్లెలో రెక్కీ నిర్వహించాడు. శుక్రవారం ఉదయం గౌతమి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా, ఇదే అదునుగా భావించి ఇంట్లోకి చొరబడ్డాడు. యాసిడ్ బాటిల్‌తో ఆమెపై దాడి చేసి బలవంతంగా తాగించాడు. కత్తితో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. విషయం తెలుసుకొని పొలం నుంచి పరుగున ఇంటికి చేరుకున్న బాధితురాలి తల్లిదండ్రులు అంబులెన్స్‌లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం బెంగళూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ కుమార్తె జీవితాన్ని నాశనం చేసిన టీడీపీ నేత కుమారుడు గణేష్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.