అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక వైసీపీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీడీపీ నేత, తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మునిసిపల్ అధికారులు పెద్దారెడ్డి ఇంటిపై సర్వే చేపట్టడం వివాదాస్పదంగా మారింది.
ఆక్రమణలు ఉన్నాయంటూ మునిసిపల్ అధికారులు కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన నివాసం వద్ద సర్వే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకసారి ఇంటికి కొలతలు వేసినప్పటికీ మళ్లీ మళ్లీ సర్వేలు నిర్వహించడం పట్ల పెద్దారెడ్డి అనుచరులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
వైసీపీ వర్గాలు మాత్రం ఈ చర్యలను బహిరంగ రాజకీయ కక్ష సాధింపుగా చూస్తున్నాయి. తాడిపత్రి పట్టణంలో వైసీపీ నేతల ఇళ్లను కూల్చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి పలు సార్లు ప్రకటించారని గుర్తుచేస్తూ, ఈ సర్వే కూడా ఆ ప్రణాళికలో భాగమేనని ఆరోపిస్తున్నారు. సర్వే నోటీసులు, తరచూ జరుగుతున్న కొలతలు తాడిపత్రి రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీయగా, స్థానికంగా ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశమైంది.