తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోతోంది. అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు అధికార పార్టీ నేతలు భారీగా తరలివెళ్లనున్నట్లుగా సమాచారం. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ బంధాన్ని తెంచుకుని, గులాబీ కండువా కప్పుకోబోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
మధ్యాహ్నం 12 గంటలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో జగిత్యాలలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో కేటీఆర్ భేటీ కానున్నారు. రాబోయే రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇతర ముఖ్య నేతలతో కలిసి నేరుగా జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లనున్నారు. అక్కడ ఆయనను అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
ప్లీనరీ వేళ.. గులాబీ గూటికి జీవన్ రెడ్డి!
ఈ నెల ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కరీంనగర్ లేదా జగిత్యాల వేదికగా జరిగే ఈ భారీ బహిరంగ సభకు ముందే జీవన్ రెడ్డి పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. ప్లీనరీ రోజున కేసీఆర్‌తో కలిసి జీవన్ రెడ్డి ఒకే వేదికపై కనిపించబోతుండటం విశేషం.
మారనున్న జగిత్యాల రాజకీయ సమీకరణాలు
జగిత్యాల కోటలో తిరుగులేని నేతగా పేరున్న జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ మరింత పట్టు సాధించనుంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్‌లోకి వలసలు పెరగడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నాయకుడు పార్టీ వీడటం ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు. మొత్తానికి, కేటీఆర్ జగిత్యాల పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.








