బాలీవుడ్ (Bollywood)లోకి హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ (Sydney Sweeney) ఎంట్రీ ఇవ్వనున్నారని, ఇందుకోసం ఆమెకు ఏకంగా భారీ పారితోషికం ఆఫర్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భారీ డీల్ ఆమోదిస్తే, భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా సిడ్నీ స్వీనీ రికార్డు సృష్టిస్తారు.
సిడ్నీ స్వీనీకి భారీ ఆఫర్
‘యుఫోరియా’ (Euphoria)’, ‘ది వైట్ లోటస్’ (The White Lotus) వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 28 ఏళ్ల సిడ్నీ స్వీనీని బాలీవుడ్ మేకర్స్ సంప్రదించినట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఆమెకు రూ. 530 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2026 ప్రారంభంలో న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్‌లలో జరగనుంది. ఈ ఆఫర్ చూసి మొదట ఆమె ఆశ్చర్యపోయారని, అయితే ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ విషయంపై సిడ్నీ స్వీనీ ప్రతినిధుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రస్తుతం సిడ్నీ స్వీనీ ‘క్రిస్టీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు, ఇది నవంబర్ 7న విడుదల కానుంది. అలాగే, ఆమె నటించిన మరో చిత్రం ‘ది హౌస్‌మెయిడ్’ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.








