పెనమలూరు శ్రీచైతన్య కాలేజీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాలేజీలో చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో కాలేజీ యాజమాన్యం.. విద్యార్థిని అనారోగ్యంతో చనిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మరణవార్త విన్న తండ్రి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన చనిపోయినట్లుగా తెలుస్తోంది.
ఇటు కూతురు, అటు భర్తను కోల్పోయి తీవ్ర శోకంతో పెనమలూరు శ్రీచైతన్య కాలేజీకి వచ్చిన ఆ విద్యార్థిని తల్లి.. తన కుమార్తెకు ఎలాంటి అనారోగ్యం లేదని స్పష్టం చేసింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే తన కుమార్తె మృతిచెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. విద్యార్థిని స్వస్థలం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.








