టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup)లో ఇవాళ (మార్చి 8) అత్యంత కీలకమైన తుది సమరం జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీని అందుకుంటుందా? లేక న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తుందా? అన్న చర్చలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి.
అయితే ఈ ఫైనల్ మ్యాచ్ చుట్టూ మరో సంచలన వార్త కూడా చక్కర్లు కొడుతోంది. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు (Retirement) పలుకుతాడన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. భారత్ టైటిల్ గెలిచినా గెలవకపోయినా సూర్య తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదని కొన్ని కథనాలు చెబుతున్నాయి.
రిటైర్మెంట్ ఊహాగానాలకు కారణాలేమిటి?
ప్రస్తుతం 35 ఏళ్ల వయస్సులో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో పెద్దగా అవకాశాలు లేకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. భారత దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తరహాలోనే కెరీర్‌కు ముగింపు పలకాలని సూర్య ఆలోచిస్తున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడిన సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రపంచకప్‌కు ముందు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే కెరీర్‌కు ముగింపు పలకడం గౌరవప్రదంగా ఉంటుందని అతను భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. నేటి ఫైనల్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు విజయం అందిస్తే కెప్టెన్‌గా తన బాధ్యతను సూర్య పూర్తి చేసినట్లవుతుంది.
కెప్టెన్‌గా సూర్య రికార్డు అదిరింది
రోహిత్ శర్మ తర్వాత భారత టీ20 జట్టు నాయకత్వం చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు నమోదు చేశాడు. అతని నాయకత్వంలో భారత జట్టు ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లపై కూడా భారత్ ఘన విజయాలు సాధించింది.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ విజయ శాతం 80 శాతం కంటే ఎక్కువగా ఉండటం అతని నాయకత్వ సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. వ్యక్తిగత ప్రదర్శనలో కొన్ని సందర్భాల్లో విఫలమైనా, కెప్టెన్‌గా మాత్రం జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు.
ఇప్పటికైతే సూర్య రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలే. ఈ విషయంపై అతని నుంచి గానీ, బీసీసీఐ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలంటే ఫైనల్ మ్యాచ్ తర్వాత వరకు వేచి చూడాల్సిందే.
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్? అభిమానుల్లో టెన్షన్








