సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్ 2026 జరుగుతున్న వేళ టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాకౌట్ మ్యాచ్‌ల ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. కీలక మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ గణాంకాల కారణంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చల్లో నిలిచాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న సూర్యపై అటు అభిమానులు, ఇటు మాజీలు విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలు, బిగ్ మ్యాచ్‌ల్లో సూర్య ఆశించిన స్థాయిలో రాణించలేదు.
ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 5 బంతుల్లో ఒకే ఒక్క పరుగు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 4 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేశాడు. వన్డే వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టుపై 2 బంతుల్లో 1 రన్ చేసి ఔటయ్యాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 28 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు.
అయితే ఇంగ్లాండ్‌పై టీ20 వరల్డ్ కప్ 2024 సెమీ ఫైనల్లో మాత్రం 36 బంతుల్లో 47 పరుగులతో సూర్యకుమార్ యాదవ్ కాస్త మెరుగైన ప్రదర్శన చూపించాడు. అయినప్పటికీ మొత్తం గణాంకాలను పరిశీలిస్తే.. కీలక మ్యాచ్‌ల్లో సూరీడు చేతులెత్తేస్తున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. సూర్యకుమార్ సాధారణ మ్యాచ్‌ల్లో మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తున్నప్పటికీ.. నాకౌట్ మ్యాచ్‌ల్లో స్థిరమైన ప్రదర్శన ఇవ్వడం లేదు. సూపర్-8 దశలో జింబాబ్వేతో డూ ఆర్ డై మ్యాచ్ ఉండగా.. సూరీడి ఈ గణాంకాలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాబోయే కీలక మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ రాణిస్తే ఈ విమర్శలకు పూర్తి స్థాయిలో చెక్ పడే అవకాశం ఉంది.








