కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో జతకట్టిన తన 46వ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఇటీవల పూజా కార్యక్రమాలు అట్టహాసంగా జరుపుకున్న ఈ సినిమా చిత్రీకరణ బుధవారం మొదలైంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది.

సూర్య ముందుకు అడుగు వేస్తున్న అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేస్తూ, “వేడుక, భావోద్వేగం, వినోదం వైపు తొలి అడుగు” అంటూ చిత్ర బృందం ఆనందాన్ని పంచుకుంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రంపై ప్రకటన వెలువడినప్పటి నుంచే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్న పాత్రలు, కథాంశాలతో ప్రేక్షకులకు చేరువైన సూర్య, తన 46వ చిత్రంతో మరో వైవిధ్యభరితమైన కథను అందించడానికి సిద్ధమవుతున్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి, లోతైన భావోద్వేగాలను, వాణిజ్య అంశాలను సమర్థవంతంగా మిళితం చేస్తూ ప్రస్తుత తరంలో గొప్ప కథకుడిగా పేరు పొందారు. గత రెండు చిత్రాలు ‘సార్’ (వాతి), ‘లక్కీ భాస్కర్’ ఘన విజయాలను సాధించి, దర్శకుడిగా వెంకీ అట్లూరి స్థాయిని మరింత పెంచాయి. ఇప్పుడు ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ తరహాలోనే మరో గొప్ప కథను సూర్య 46 ద్వారా అందించబోతున్నారని అంచనా వేస్తున్నారు.








