కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన తాజా చిత్రం ‘రెట్రో’ (Retro Movie) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. మే 1న విడుదలైన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా, కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో తెరకెక్కింది. సూర్య కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ‘రెట్రో’ రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 235 కోట్లు (థియేట్రికల్, నాన్-థియేట్రికల్) వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
సూర్య కెరీర్‌లో టాప్ కలెక్షన్స్
‘రెట్రో’ సినిమా సూర్య కెరీర్ రూ. 235 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రం తమిళనాడులో అత్యధిక వసూళ్లను రాబట్టింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. సూర్య కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇతర చిత్రాలు ఇలా ఉన్నాయి:
- 24 (2016): రూ. 157 కోట్లు
- సింగం 2 (2013): రూ. 122 కోట్లు
- 7th సెన్స్ (2011): రూ. 113 కోట్లు
- కంగువా (2024): రూ. 106 కోట్లు
- సికిందర్ (2014): రూ. 95 కోట్లు
‘రెట్రో’ సినిమా విశేషాలు
‘రెట్రో’లో సూర్య ఒక గ్యాంగ్‌స్టర్‌గా యాక్షన్, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన పాత్రలో మెప్పించాడు. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించగా, జోజూ జార్జ్, జయరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, తెలుగులో మాత్రం నిరాశపరిచింది. సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, రొమాంటిక్ యాక్షన్ జోనర్‌లో కార్తీక్ సుబ్బరాజ్ తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత సూర్య అభిమానులు థియేటర్ల వద్ద మేళతాళాలతో సంబరాలు చేసుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ‘రెట్రో’ని ప్రశంసిస్తూ, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ను అభినందించారు.
‘కంగువా’ నిరాశ తర్వాత భారీ హిట్
2024లో విడుదలైన ‘కంగువా’ (Kanguva) సినిమా రూ. 300-350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, నెగెటివ్ టాక్‌తో సూర్యకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా తొలిరోజు రూ. 22 కోట్లు వసూలు చేసినప్పటికీ, మొత్తంగా రూ. 106 కోట్ల వద్ద ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ‘రెట్రో’ సినిమా సూర్యకు భారీ విజయాన్ని అందించి, ‘కంగువా’ లోటును తీర్చింది.