నటుడు సూర్య (Suriya) ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ అగరం ఫౌండేషన్ (Foundation) 15వ వార్షికోత్సవం సందర్భంగా చెన్నై (Chennai)లోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఘనంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు నటుడు శివకుమార్, సూర్య, కార్తీ, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్, వెట్రిమారన్ నిర్మాత కలైపులి ఎస్ ధాను, డ్రమ్స్ శివమణి, అలాగే మక్కల్ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమలహాసన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అగరం ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న విద్యాసేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ, అగరం ఫౌండేషన్ 15 ఏళ్లు పూర్తయ్యాయని, “విద్య అనేది ఆయుధం” అనే తమ నమ్మకం ఈ రోజుకు వాస్తవంగా మారిందని అన్నారు. విద్య అంటే కేవలం పుస్తకాలలో నేర్చుకునే విషయం కాదు, మన సంప్రదాయాలు, సంస్కృతిని కూడా విద్యార్థులకు పరిచయం చేయడం, వారి ప్రతిభను వెలికితీయడం అగరం ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం అని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడుతున్న విద్యార్థులకు అగరం ఫౌండేషన్ సేవలు అందిస్తూ, విద్య ఎంత బలం కలిగినదో ఆ ప్రాంత విద్యార్థులకు తెలియజేయడమే వారి ప్రాథమిక లక్ష్యం అన్నారు.

15 ఏళ్లలో 51 మంది వైద్యులు…
అగరం ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 8 వేలకు పైగా విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకుని వివిధ రంగాల్లో విజయవంతమయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఇందులో 51 మంది విద్యార్థులు వైద్యవిద్యను పూర్తిచేసి వైద్యులుగా మారిన విషయాన్ని ప్రత్యేకంగా గుర్తించారు. సూర్య స్వయంగా రెట్రో సినిమాల లాభాల నుండి రూ. 10 కోట్లు అగరం ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చి పేద విద్యార్థులకు అండగా నిలబడ్డారు. ఇలాంటి సేవల కోసం సూర్యపై సోషల్ మీడియా లో ‘నిజంగా దేవుడు’ అనే ప్రశంసలు కురుస్తున్నాయి.

కమలహాసన్ సందేశం: విద్యే సాహసం, ప్రేమే ఆయుధం
ఈ వేడుకలో ముఖ్య అతిథిగా కమలహాసన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, “విద్య, ప్రేమ ఒక చోటే లభించటం సాధ్యం కాదు. అది అమ్మ వద్ద, అగరం వద్ద లభిస్తాయి” అని చెప్పారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి ముళ్ల కిరీటాలుగాను ఎదురవుతాయని, కాని ఈ సేవలను నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
2017 తర్వాత నీట్ పరీక్షల వల్ల విద్యార్థులు వైద్యవిద్యను కొనసాగించలేకపోతున్నారని విమర్శించారు. అందుకే నీట్ పరీక్షలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ పరీక్షలపై చట్ట సవరణలు రావాలని కోరారు. విద్య కేవలం యుద్ధంలో ఆయుధంగా మాత్రమే కాక, దేశాన్ని వెలుగులోకి తీసుకువచ్చే శక్తిగా ఉందని, సనాతన సంకెళ్లను, అధికారం దోచుకునే సంకెళ్లను విడిపించే ఆయుధం కూడా అని కమలహాసన్ అన్నారు.







